బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 234 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ విడుదల
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 234 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ విడుదల
basara


బాసర, 23 జూలై (హి.స.)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అద్భుతమైన కృష్ణశిలలతో పునర్నిర్మించేందుకు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ రూ. 234 కోట్ల అంచనా వ్యయంతో అధికారికంగా టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల్లో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు విస్తరించనున్నారు. అలాగే గర్భగుడి, అర్థమండపాల వైశాల్యాన్ని కూడా 5,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయం చుట్టూ ఉత్తరం వైపు 9 అంతస్తుల భారీ రాజగోపురంతో పాటు మిగిలిన మూడు వైపులా 7 అంతస్తుల గోపురాలను, 33 అడుగుల వెడల్పుతో నాలుగు మాడ వీధులను నిర్మిస్తారు.

ఈ ప్రాజెక్టులో భక్తుల వసతులకు పెద్దపీట వేశారు. ఒకేసారి 6,000 మంది భక్తులు వేచి ఉండేలా, అన్ని వసతులతో 70,000 చదరపు అడుగుల్లో ఆధునిక క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 200 మంది ధ్యానం చేసుకునే ధ్యాన మందిరం, పవిత్ర కోనేరు, ప్రసాద విక్రయ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నదీ తీరాన స్నాన ఘట్టాలు, ఆరోగ్య కేంద్రాలు, విస్తారమైన పార్కింగ్ సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. జులై 29 నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ ఆగస్టు 7 వరకు కొనసాగనుండగా, ఆగస్టు 12న ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి త్వరలోనే క్షేత్రస్థాయి పనులను వేగవంతం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande