
అమరావతి, 23 జూలై (హి.స.)
రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తూ ప్రజలను తికమక పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ కనీసం ఒక్కసారైనా నేరుగా వచ్చి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి త్వరలోనే ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇక్కడ భారీ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో పాటు ప్రముఖ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. అమరావతిలో భవనాల నిర్మాణాలు అద్భుతంగా సాగుతున్నాయని, భవిష్యత్తులో ఇది అత్యంత అద్భుతమైన నివాస యోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఐకానిక్ భవనాలకు సంబంధించిన మొదటి డైమండ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్ధమవుతాయని ప్రకటించారు. అంతేకాకుండా ప్రాంతీయ అనుసంధానం కోసం త్వరలోనే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతుందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi