రెండో విడతలో కొత్తగా 7,897 మందికి బీటెక్ సీట్లు
మిగిలిపోయిన సీట్లు 14,257 28లోపు రిపోర్ట్ చేస్తేనే సీటు నిలిచేది.
Btech students


హైదరాబాద్, 24 జూలై (హి.స.)ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్లో కొత్తగా 7,897 మంది విద్యార్థులు బీటెక్ సీట్లు పొందారు. రెండో విడత సీట్లను ఎప్సెట్ ప్రవేశాల కమిటీ బుధవారం రాత్రి కేటాయించింది. సీట్ల వివరాలను ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన గురువారం వెల్లడించారు. మొత్తం కన్వీనర్ కోటా కింద 176 కళాశాలల్లో 94,424 సీట్లు ఉండగా.. వాటిల్లో రెండో విడతతో కలుపుకొని 80,167 మంది సీట్లు సాధించారు. అంటే 84.90 శాతం సీట్లు భర్తీ కాగా.. ఇంకా 14,257 సీట్లు మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్ల కేటాయింపు సంఖ్య కొంత తగ్గింది. గతేడాదితో పోల్చుకుంటే ఆ కోర్సులకు స్వల్పంగా డిమాండ్ తగ్గినట్లు స్పష్టమవుతోంది. కోర్ బ్రాంచీల్లో మెకానికల్లో మాత్రమే గతేడాది కంటే కొద్దిగా పెరిగారు. చివరకు ఎంత మంది చేరతారన్నది ఈ నెల 28 నాటికి స్పష్టత వస్తుంది.

విద్యార్థులు ఏం చేయాలంటే?...

రెండో విడతలో సీట్లు పొందిన వారు వెబ్సైట్ నుంచి ఈ నెల 25లోపు ఫీజు చెల్లించి.. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి.. 28వ తేదీలోపు కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ టీసీతో పాటు ఇతర విద్యార్హతలకు సంబంధించి జిరాక్స్ పత్రాలను మాత్రమే కళాశాలల్లో అందజేయాలి. సీట్లు రద్దు చేసుకోవడానికి (ఆన్లైన్లోనే) 28వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోపు రద్దు చేసుకుంటే చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి ఇస్తారు. అలాగే విద్యార్థులకు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీశాబ్ ద్వారా సీట్లు వస్తే ఫీజును తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande