సాంకేతికతలో పోలీసులే ముందుండాలి: సైబర్ మోసాలపై డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక
సాంకేతికతలో పోలీసులే ముందుండాలి: సైబర్ మోసాలపై డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక
Dgp


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

పెరుగుతున్న సైబర్ నేరాలను

సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ, సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్ఎఆర్ (e-Zero FIR), క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ప్రగతి (PRAGATI -Pro-Active Governance and Timely Implementation) వేదిక ద్వారా దేశవ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు, పాలనకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) రాష్ట్రాల సైబర్ భద్రత పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని డీజీపీ తెలిపారు. మొత్తం తొమ్మిది కీలక పనితీరు సూచికల (KPIs) ఆధారంగా రాష్ట్రాలకు జాతీయ ర్యాంకులు కేటాయిస్తారని, ఆ అన్ని అంశాల్లో తెలంగాణ పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande