
నాగర్ కర్నూల్, 24 జూలై (హి.స.)
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర
సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సమర్పించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బీఎల్డీలు, బీఎల్వోలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. కొల్లాపూర్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐర్) ప్రక్రియను శుక్రవారం క్షేత్ర స్థాయిలో మంత్రి స్వయంగా పరిశీలించారు. వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సందర్శించి, ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రతి వార్డు, గ్రామంలోని బీఎల్ఎలు, బీఎల్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్హులైన స్థానిక ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి స్పష్టం చేశారు. పారదర్శకమైన ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్ఎల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన సమీక్షలో బీఎల్ఎలు, బీఎల్వోల పనితీరును మంత్రి పరిశీలించారు. ఫారాల పంపిణీ సజావుగా జరుగుతోందా.. నింపిన ఫారాలను సకాలంలో తిరిగి సేకరిస్తున్నారా అని అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..