నీట్ పేపర్ లీకేజీ ముమ్మాటికీ మహాపాపమే
తప్పును సరిదిద్దేందుకే మళ్లీ పరీక్షను నిర్వహించాం తెలంగాణలో ప్రశ్నపత్రాలు లీకైతే విద్యాశాఖను చూసే సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించారా? కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
KISHAN REDDY


హైదరాబాద్, 24 జూలై (హి.స.)నీట్ పేపర్ లీకేజీ ముమ్మాటికీ మహా పాపమేనని, తప్పు జరిగిందనే పరీక్షను రద్దు చేసి సమర్థంగా మళ్లీ నిర్వహించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణలో 2025లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకైతే విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. జగిత్యాలలో గత విద్యాసంవత్సం అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీకైందని, దానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు.

ఈ మేరకు గురువారం కిషన్రెడ్డి దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘కొందరు ఉపాధ్యాయులు స్వార్థంతో విద్యార్థుల జీవితాలు నాశనం కావడానికి కారణమయ్యారు. పేపర్ లీకేజీకి కారణమైన 17 మందిని జైల్లో పెట్టించాం. మళ్లీ పరీక్షను నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేశాం. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి 2024లో చట్టం చేశాం. త్వరలో జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తున్నాం. దీనికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలి. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. సభలో నీట్పై ఎంతసేపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వారిచ్చే సూచనలు తీసుకుంటాం.

అంతేకానీ రోడ్లపై ధర్నాలు చేయడం, పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం అప్రజాస్వామ్యం. తెలంగాణలో శాసనసభ ఎన్నికలప్పుడు విద్యార్థులతో అశోక్నగర్ సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడిన విషయాలు రేవంత్రెడ్డి, రాహుల్గాంధీలకు గుర్తున్నాయా? కోదండరాంకు ఉద్యోగం వచ్చాక నిరుద్యోగుల్ని మరచిపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భారాస పాలనలో టీజీపీఎస్సీ పేపర్లు లీకై విద్యార్థులు నానాఅవస్థలు పడ్డారు. అప్పుడే తప్పూ జరగనట్టు ఇప్పుడు కేటీఆర్ మమ్మల్ని విమర్శిస్తున్నారు’’ అని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande