
గోదావరిఖని, 24 జూలై (హి.స.)
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, వాటిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందిస్తున్న ప్రత్యేక వైద్య సేవలు, చికిత్సా సౌకర్యాలు, వైద్యుల అందుబాటు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలతో అనేక ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అనవసరంగా అధిక వ్యయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న సేవలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు ఎక్కువ మంది ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచుకుని అందుబాటులో ఉన్న సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ప్రత్యేక వైద్య విభాగానికి సంబంధించిన సేవలు, వైద్యుల అందుబాటు రోజులు, చికిత్సల వివరాలను ఆసుపత్రి ఆవరణలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా న్యూరో సర్జరీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, వెన్నెముక, మెడ సంబంధిత సమస్యలు, తలకు గాయాలైన రోగులకు అందిస్తున్న చికిత్సలపై వివరాలు తెలుసుకున్నారు. న్యూరో సర్జన్ ప్రతి బుధవారం, శుక్రవారం సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు