
హైదరాబాద్, 24 జూలై (హి.స.)2036 నాటికి ప్రపంచంలోని టాప్-10 క్రీడా దేశాల జాబితాలో భారత్కు స్థానం దక్కడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ‘11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026’ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 2026-27 కేంద్ర బడ్జెట్లో ఖేలో ఇండియా మిషన్కు కేటాయింపులను పెంచుతూ క్రీడలకు రూ.4,800 కోట్లు కేటాయించాం. జాతీయ ఆస్తుల సంరక్షణలో సీఐఎస్ఎఫ్ సేవలు అభినందనీయం. సీఐఎస్ఎఫ్ ఇటీవల క్రీడాకారుల నియామక కార్యక్రమం చేపట్టగా.. 332 మంది యువ క్రీడాకారులు నేరుగా సీఐఎస్ఎఫ్లో చేరారు. వారిలో 179 మంది మహిళా క్రీడాకారిణులను ఉండటం గొప్ప విషయం’’ అని పేర్కొన్నారు. ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ హర్ప్రీత్ కౌర్ సోహి మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో 1,600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. పోలీసు, సీఏపీఎఫ్ వర్గాల్లో క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణ, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం ఈ క్రీడా పోటీల లక్ష్యమన్నారు. అంతకుముందు క్రీడాకారులు కవాతు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఏడీజీ సౌత్ పద్మాకర్, ఐజీ ఎస్ఆర్ శరవణన్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్