వైజాగ్లో అదానీ ఎనర్జీకి రూ. 8,500 కోట్ల భారీ ప్రాజెక్ట్
వైజాగ్లో అదానీ ఎనర్జీకి రూ. 8,500 కోట్ల భారీ ప్రాజెక్ట్
adani


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్‌) రాష్ట్రంలో రూ. 8,500 కోట్ల విలువైన భారీ ఇంటర్‌-స్టేట్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును దక్కించుకుంది. విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని ద్వారా సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రభుత్వం నిర్వహించిన టారిఫ్-ఆధారిత పోటీ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానంలో అత్యంత పోటీతత్వ ధరను కోట్ చేసి అదానీ ఎనర్జీ ఈ ప్రాజెక్టును కైవసం చేసుకుంది. ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాజెక్టును 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రాజెక్టును 'వైజాగ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్' అనే ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ) కింద నిర్వహించనున్నారు.

ఈ ప్రాజెక్టుపై అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ కందర్ప్ పటేల్ మాట్లాడుతూ.. భారతదేశ పారిశ్రామిక ప్రగతికి అవసరమైన ఇంధన మౌలిక సదుపాయాల నిర్మాణంలో వైజాగ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సామర్థ్యం అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా, పెందుర్తి-విశాఖపట్నం ప్రాంతంలో పెరుగుతున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్‌కు గ్రిడ్‌ను బలోపేతం చేస్తుంది అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande