గిరిజన పాఠశాలలకు పక్కా భవనాలు.. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం: మంత్రి లోకేశ్
గిరిజన పాఠశాలలకు పక్కా భవనాలు.. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం: మంత్రి లోకేశ్
Lokesh


హైదరాబాద్, 24 జూలై (హి.స.)వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది రెండేళ్ల తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు.

మనందరి రెండేళ్ల కృషి ఫలించింది. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు 'నో అడ్మిషన్' బోర్డులు చూస్తున్నాం. ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి విజయం. వారే ప్రభుత్వ పాఠశాలలకు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని లోకేశ్‌ అన్నారు. తన నియోజకవర్గమైన మంగళగిరిలో ఒక తల్లి తన బిడ్డకు ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇప్పించాలని అడగడం తనను ఆశ్చర్యపరిచిందని, ప్రభుత్వ బడుల్లో సీట్లకు డిమాండ్ పెరగడం ఉపాధ్యాయుల కఠోరశ్రమకు నిదర్శనమని కొనియాడారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణల వెల్లువ

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగానే 'తల్లికి వందనం' పథకాన్ని గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు.

2025లో 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,090 కోట్లు, 2026లో 67.47 లక్షల మందికి రూ. 10,120 కోట్లు అందించామని గణాంకాలతో సహా వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, పారదర్శకమైన టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తీసుకొచ్చామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande