
హైదరాబాద్, 24 జూలై (హి.స.)
సికింద్రాబాద్ లోతుకుంటలోని రక్షణ శాఖ (ఆర్మీ) భూముల వివాదంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అధికారుల ప్రవర్తనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీకి చెందిన సర్వే నంబర్ 136లోని భూమి తమదంటూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఈ వివాదంలో జోక్యం చేసుకున్న హైడ్రా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. రక్షణ శాఖకు సంబంధించిన భూములపై సర్వహక్కులు ఆర్మీకే ఉంటాయని, అలాంటి సున్నితమైన సరిహద్దు మరియు యాజమాన్య వివాదాల్లో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఏ అధికారంతో నోటీసులు జారీ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. హైడ్రా పరిధి దాటి ప్రవర్తిస్తోందని మండిపడిన ధర్మాసనం.. కమిషనర్ రంగనాథ్‌ను తీసుకువెళ్లి ఆర్మీ బ్యారక్స్‌లో పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్ట నిబంధనలను అతిక్రమించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలని హైడ్రా మరియు రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi