
కొత్తగూడెం, 25 జూలై (హి.స.)
మహిళలు, బాలికల భద్రతకు
మరింత భరోసా కల్పించేలా జిల్లాలో 'పోలీస్ అక్క' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహిళా పోలీసు సిబ్బందికి సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా పోలీసులకు 'పోలీస్ అక్క' కార్యక్రమం విధులు, బాధ్యతలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 'పోలీస్ అక్క'గా నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని, తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు చెప్పే విధంగా వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
మహిళలు, బాలికల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్, బుల్లీయింగ్, ఈవోజింగ్, స్టాకింగ్, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత షీ టీమ్, ఎన్హెచ్ఐలకు సమాచారం అందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 'పోలీస్ అక్క' కార్యక్రమం కేవలం అవగాహన కార్యక్రమాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు అందుబాటులో ఉండే వ్యవస్థగా పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు