ఆస్తి పన్ను పెంచొద్దు
నగరవాసుల నుంచి బల్దియాకు 3,154 ఫిర్యాదులు క్యూర్ బిల్లుపై సూచనలకు ముగిసిన గడువు.
Property tax


హైదరాబాద్, 25 జూలై (హి.స.) ఆస్తిపన్ను పెంచొద్దంటూ నగరవాసులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విన్నవించారు. వ్యతిరేకతను తెలియజేస్తూ క్యూర్ బిల్లుపై 3,154 మంది ఫిర్యాదు చేశారు. వార్షిక అద్దె ప్రతిపాదికన ప్రస్తుతం పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను మదింపు చేపడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగా భూ విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన క్యూర్-2026 ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. అసెంబ్లీలో ఇది ఆమోదం పొందితే జీహెచ్ఎంసీ-1955 చట్టం స్థానంలో క్యూర్ చట్టం అమల్లోకి వస్తుంది. అదే జరిగితే.. ప్రతి ఇంటికీ ఆస్తిపన్ను పెరుగుతుంది. బిల్లుపై జీహెచ్ఎంసీ ఫిర్యాదులు, సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ సర్కారు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. 4 వేలకుపైగా అర్జీలను పరిశీలించాల్సి ఉందని ఉన్నతాధికారి తెలిపారు.

అనుమతిలేని నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ క్యూర్ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేర్చింది. అందులో అక్టోబరు 28, 2015ని కటాఫ్ తేదీగా చేర్చింది. గత సర్కారు నవంబరు 2015లో తీసుకొచ్చిన అనుమతిలేని నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకానికి ప్రత్యామ్నాయంగా సర్కారు ఈ ప్రతిపాదనను చట్టంలో చేర్చగా కటాఫ్ తేదీని తగ్గించాలంటూ కొందరు సర్కారుకు విన్నవించారు. వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని, వాటి ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేసి తుది బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని పురపాలకశాఖ తెలిపింది.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande