ఎల్ నినోతో తెలంగాణలో వర్షాభావం.. రైతులకు సీఎస్ కీలక సూచన
దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
Telangana logo


హైదరాబాద్, 25 జూలై (హి.స.)దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. హైదరాబాద్లో ఎల్ నినోపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 27 శాతం వర్షపాతం లోటు ఉందని వివరించారు. రాష్ట్రంలో కేవలం 7 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. 385 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు.

రైతులకు వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. తాగు నీరు కోసం రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ప్రాధాన్యం ఇస్తు్న్నామని అన్నారు. వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర (MSP) ఉందని.. ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో వరి సాగు ఇప్పటి వరకు 24 శాతం కంటే తక్కువ నమోదు అయిందని అన్నారు. సెప్టెంబరులోనూ తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సీజన్లో ఫామ్ పాండ్స్ నిర్మాణం విస్తృతంగా చేపట్టాల్సి ఉందన్నారు. ప్రతి 45 రోజులకు మండల స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande