పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడికి చెక్: రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక 'కుంకీ' ఏనుగులు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడికి చెక్: రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక 'కుంకీ' ఏనుగులు!
kunki


పార్వతీపురం, 25 జూలై (హి.స.)

:ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి తరచూ ప్రవేశిస్తూ పంటలను, ఆస్తులను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుల నుండి మన్యం జిల్లా ప్రజలకు, గిరిజన రైతులకు తక్షణ ఉపశమనం లభించనుంది. అడవి ఏనుగుల దాడులను అదుపు చేయడానికి వీలుగా ప్రత్యేక శిక్షణ పొందిన 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు కుంకీ ఏనుగులను ప్రభుత్వం మన్యం జిల్లాకు తరలించింది.ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి ఈ కుంకీలను లారీల్లో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి శిబిరానికి చేర్చారు.

ఈ ప్రయాణ మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు ఈ గజరాజులు చేరుకోగా, పవన్ కళ్యాణ్ వీటికి పూలమాలలు వేసి, ఆహారం తినిపించి ఘనంగా స్వాగతం పలికారు.ఈ రెండు కుంకీ ఏనుగులు ఇప్పటికే పలమనేరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఆరు పెద్ద ఆపరేషన్లలో పాల్గొని, అడవి ఏనుగులను విజయవంతంగా బంధించడంలో లేదా అడవుల్లోకి తోలడంలో కీలక పాత్ర పోషించాయి. మన్యం జిల్లా వాతావరణ పరిస్థితులకు ఇవి అలవాటు పడిన తర్వాత, అటవీ శాఖ సిబ్బందితో కలిసి వీటిని ఆపరేషన్లలో ఉపయోగించనున్నారు.కేవలం కుంకీలనే కాకుండా, మన్యం జిల్లాలో మానవ-మృగ సంఘర్షణను శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం మరికొన్ని అధునాతన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ కంచెల నిర్మాణం, కందకాల తవ్వకం, డ్రోన్ల ద్వారా ఏఐ (AI) నిఘా మరియు 'హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్' ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఈ చర్యల ద్వారా దశాబ్దాలుగా ఏనుగుల భయంతో బతుకుతున్న మన్యం గిరిజన గ్రామాల్లో శాంతి చేకూరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande