
హైదరాబాద్, 25 జూలై (హి.స.)నీట్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలంతా దిల్లీలో పోరాటం చేస్తుంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దిల్లీలోని జంతర్మంతర్కు ఎందుకు వెళ్లలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తదితరులతో కలిసి ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘కేటీఆర్ నల్లచొక్కా వేసుకొని అబద్ధాలు చెబుతున్నారు. భారాస పాలనలో లీకుల పర్వం సాగింది. 2019లో 20 మందికిపైగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు గ్లోబరీనా సంస్థ కారణం కాదా? సంబంధిత నివేదికను ఎందుకు బయటపెట్టలేదు. భారాస పార్టీ నిధుల నుంచి నాడు చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలి. నీట్ విద్యార్థులకు మద్దతుగా దిల్లీలో జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా సీఎం రేవంత్రెడ్డి కొడంగల్లో నిరసనలో పాల్గొన్నారు. రాహుల్గాంధీకి పేరొస్తుందని ప్రధాని మోదీతో కుట్ర పన్ని కేటీఆర్ బట్ట కాల్చి మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
అర్హుల ఓట్లను తొలగించకుండా చూడాలి
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమంలో అర్హుల ఓట్లను ఒక్కటి కూడా తొలగించకుండా కాంగ్రెస్ శ్రేణులు శ్రద్ధగా చూడాలని మహేశ్కుమార్గౌడ్ సూచించారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం పార్టీ శ్రేణులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు పాల్గొన్నారు. మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ... ‘‘ఈ నెల 30లోగానే అర్హుల ఓటర్ల పేర్లన్నీ నమోదయ్యేలా చూడాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు నిత్యం ఓటర్ల నమోదు ప్రక్రియ పురోగతిపై సమీక్ష చేయాలి’’ అని చెప్పారు. మీనాక్షి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ జరిగిన ఓటర్ల నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్