
మహబూబాబాద్, 25 జూలై (హి.స.)
ఒకే రకమైన పంటల సాగుతో రైతులకు, ప్రభుత్వాలకు నష్టమే తప్ప లాభం ఉండదని.. వెరసి నిత్యవసరాల ధరల పెరుగుదల ఉంటుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఏ ప్రాంతానికి, ఆ ప్రాంతం వారు అన్ని రకాల పంటలు సాగు చేస్తే ప్రజలకు ధరల పెరుగుదల ఇబ్బందులు ఉండవన్నారు. సూపర్ ఎల్నినో వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరు తడి పంటలు, పప్పు దినుసులు, ఆయిల్ ఫాం, నూనె గింజలు, కూరగాయలు వంటివి పండించాలని సూచించారు. శనివారం ఆమె మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, ఏడీఏ విజయ్ చంద్ర, ఏవో వీరాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వీబీ -జీ రాంజీ (ఉపాధి హామీ) పథకంలోని యానిమల్ హెల్త్ క్లినిక్స్ సౌకర్యాన్ని ఉపయోగించి, కుక్కల మాదిరిగానే కోతులకు కూడా 'స్టెరిలైజేషన్' చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు.
అధిక యూరియా, పురుగుమందుల వాడకం వల్ల ఆహారంలో పోషకాలు తగ్గి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని. రైతులు సామాజిక బాధ్యతతో ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ/ఆరోగ్యకరమైన పంటలను పండించాలి. తక్కువ రసాయనాలు వాడే రైతుల ఉత్పత్తులకు నగరాల్లో మంచి మార్కెటింగ్ కల్పిస్తామని అన్నారు. అవసరం లేని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి వేల కోట్లు వెచ్చించే బదులు, ఆ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, మంచి పాఠశాలలు, కళాశాలలు నిర్మించుకోవచ్చన్నారు. పంట మార్పిడి అవగాహన కార్యక్రమంలో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి- భారతీయ ఉద్యాన పరిశోధన స్థానం, బెంగళూరు వారిచే రూపొందించబడిన నల్ల తామర పురుగులు తట్టుకునే అర్క తేజస్వి రకం విత్తనాలను రైతులకు కలెక్టర్ అందించారు. మధ్య తెలంగాణ మండలి జిల్లాలకు సంబంధించి మిరప సాగు గురించి పరిశోధనలు జరుపుతున్న ఉద్యాన పరిశోధన స్థానం, మల్యాల వారిచే ఈ రకాన్ని 2022 సంవత్సరం నుండి రైతుల క్షేత్రాలు లో సాగు చేయించి ఎకరానికి 40 క్వింటాల్ వరకు మిరప దిగుబడి సాధించడం జరిగింది.
అనంతరం మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నర్సింహులపేట (బాలికల)ను సందర్శించి విద్యార్థులతో సౌకర్యాల గురించి ఆరాతీశారు. పరిసరాలు పరిశీలించి టీచర్ల బోధన గురించి పిల్లలను అడిగి తెసుకుని, సమస్యలు ఏమైనా ఉంటే కంప్లైంట్ బాక్సులో వేయాలని సూచించారు. మండలంలోని ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ గురించి తహసీల్దార్ కృష్ణవేణిని అడిగి తెలుసుకుని, మిగిలినవి కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు