ఇది విద్యార్థుల విజయమే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఇది విద్యార్థుల విజయమే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
mahesh


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాల పోరాటానికి దక్కిన విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, వాటి ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకను ప్రభుత్వం గౌరవించక తప్పదని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇది విద్యార్థులు సాధించిన విజయం: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవి కాపాడుకోవడానికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. నీట్ పరీక్ష లీక్ జరిగినప్పుడే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదే కాదన్నారు. మూడు నెలల పాటు ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించిన ఆయన.. విద్యార్థులపై పెరిగిన ఒత్తిడి, నిరసనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు.

యువత పోరాటంతో కేంద్రం దిగివచ్చింది: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

యువత తమ దమ్ము ఏంటో నిరూపించారని, వారి పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో పేపర్ లీకులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ పతనం ప్రారంభమైంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యార్థులు, యువత పోరాటానికి దక్కిన విజయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈ పరిణామంతో బీజేపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, నీట్ ప్రశ్నపత్రాల లీక్పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని కేంద్రాన్ని కోరారు.

విద్యార్థుల పోరాటం ఫలించింది: ప్రొఫెసర్ కోదండరాం

విద్యార్థుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రస్తుత ప్రభుత్వాలతో పాటు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు కూడా ఒక కనువిప్పుగా మారాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande