టెండర్ నుంచి లావాదేవీల వరకు..
ధరణి ఏర్పాటు.. యాజమాన్యం మార్పులపై విచారణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు సెట్కు అధికారాలు జారీ.
Police officer


హైదరాబాద్, 25 జూలై (హి.స.)సాగు భూముల లావాదేవీల పోర్టల్ ధరణిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీ(సెట్)కి విస్తృత అధికారాలు అప్పగించింది. పోర్టల్ సాఫ్ట్వేర్ రూపకల్పన నుంచి టెండర్ ప్రకటన, బిడ్ల దాఖలు, నిర్వహణదారుడి ఎంపిక, పోర్టల్లో లావాదేవీలు, పోర్టల్ వెలుపల జరిగిన అనుమానాస్పద లావాదేవీల నిగ్గుతేల్చే బాధ్యతలను అప్పగించింది. అవినీతి నిరోధకశాఖ(అనిశా) డైరెక్టర్ జనరల్ చారుసిన్హా ఛైర్పర్సన్గా కమిటీని ఏర్పాటు చేయగా ముగ్గురు ఐపీఎస్.., ముగ్గురు ఐఏఎస్ అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ)కు చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్ను కమిటీలో నియమించారు. ధరణి పోర్టల్లో భూఅక్రమాలు జరిగాయంటూ పలు వేదికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు పలుమార్లు పేర్కొన్నారు.

ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రైవేటు సంస్థ నుంచి తప్పించి ఎన్ఐసీకి అప్పగించి భూభారతిగా పేరు మార్చారు. ఈక్రమంలో భూఅక్రమాలను వెలికితీసేందుకు తొలుత ఫోరెన్సిక్, నిపుణుల కమిటీలను ఏర్పాటుచేసి అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని తీసుకుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో భూఅక్రమాలు, ధరణి పోర్టల్ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘనలపై చర్చించింది. అనంతరం సెట్ ఏర్పాటుపై తీర్మానించగా శుక్రవారం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్)ను ప్రభుత్వం జారీ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధరణి పోర్టల్ తయారీ నుంచి నిర్వహణ వరకు అనేక లోపాలున్నాయంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టాలని సెట్ను ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చిన విధానపరమైన నిర్ణయాల్లో లోపాలను, ఇతరత్రా అంశాలను సెట్ ముందుంచింది. వీటిపై విచారణ చేపట్టి ఆధారాలు గుర్తించాలంది.

టెండర్ ప్రక్రియపై విచారణ

2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ ప్రారంభమైంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఈ టెండర్ను పిలవగా, బిడ్ల దాఖలు, వాటి మదింపు, టెండరు కేటాయింపు, డిజైన్, అభివృద్ధి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు సంబంధించి విధానపరమైన లోపాలున్నట్లు అనుమానాలున్నాయి. చట్టబద్ధంగా టెండర్ జరిగిందా అనేదానిపై విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థకు సంబంధించి.. అప్పట్లో దివాలాపరమైన ఆరోపణలొచ్చాయి. వీటి లోపాలకు సంబంధించి బాధ్యులెవరో నిర్ధారించాలని సెట్కు నిర్దేశించారు. అదే సమయంలో సదరు సంస్థలోకి పెట్టుబడులు రాగా ఆ వివరాలేవీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు(సెబీ) వద్ద నమోదు కాకపోవడం వంటి వాటిపైనా విచారించనున్నారు.

అనధికారిక లావాదేవీలపై నజర్

ధరణి పోర్టల్ నిర్వహణ సందర్భంగా అనధికారిక లావాదేవీలు, పోర్టల్ భద్రతకు భంగం కలిగించి సున్నితమైన భూయాజమాన్య హక్కులకు నష్టం కలిగించి ఉంటారనే కోణంలో విచారించనున్నారు. పోర్టల్లో లావాదేవీల రుసుం చెల్లింపుల గేట్వేలో లోపాలుండటం, నిబంధనల ప్రకారం రుసుం ప్రభుత్వానికి జమ కాకపోవడం వంటి లోపాలు వెలుగుచూశాయి. ధరణి వెలుపల జరిగిన లావాదేవీలతో పలువురికి లబ్ధి చేకూరడం, అధికారిక పనిగంటలు ముగిశాక కార్యాలయాల బయట లావాదేవీలు జరగడం, ఆడిటింగ్ లేకపోవడం, పోర్టల్లోకి లాగిన్ అయిన ఆధారాలేవీ లేకుండా చేసిన అంశాలపై విచారణ చేపట్టనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande