భోగపురంలో లోకేష్ పర్యటన
భోగపురంలో లోకేష్ పర్యటన
Lokesh


భోగాపురం, 25 జూలై (హి.స.)

వచ్చే నెల ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ (భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్) ప్రారంభం కానుంది. ఈ లోగా పనులన్నీ వంద శాతం పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమైన టాస్క్‌గా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఉత్తరాంధ్రలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దాదాపు 3 లక్షల మంది ప్రజలను తరలించి, దేశం గర్వించేలా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. ఈ ఏర్పాట్లపై ఆయన ఇవాళ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా రికార్డు స్థాయిలో 13,000 మంది మహిళలతో దేశంలోనే అతిపెద్ద 'ధింసా నృత్య' ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. భారీ సంఖ్యలో జన సమీకరణ జరుగుతున్నందున జాతీయ రహదారిపై ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, పరిశ్రమలు, ఐటీ రంగానికి ఇది ఊతమిస్తుందని, కాబట్టి ఏ చిన్న లోపం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

---

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande