
అమరావతి: 25 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఆర్థిక చేయూత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం నిధుల పంపిణీ ప్రక్రియను ఇవాళ అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో ఈ నిధులను నేరుగా జమ చేయడం ప్రారంభించింది .రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. గతంలో ఉన్న విధివిధానాలను సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకమైన లబ్ధిదారుల జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అర్హత పొందిన ప్రతి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల మొబైల్ నంబర్లకు ఈ నిధుల జమకు సంబంధించిన సమాచారం అందుతోంది.ఈ నిధుల విడుదల ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై, విద్యా సంవత్సరం కొనసాగుతున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం అందడం తమ పిల్లల చదువుల ఖర్చులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని విద్యార్థుల తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి నిధుల బదిలీని రాబోయే కొద్ది రోజుల్లోనే వంద శాతం పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi