
అనంతపురం, 28 జూలై (హి.స.) ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో 'న్యాచుర్ వెల్ఫేర్ కౌన్సిల్' ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపుర నగరంలోని టవర్ క్లాక్ వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన సప్తగిరి సర్కిల్ మీదుగా (SSBN) కళాశాల వరకు ఉత్సాహంగా సాగింది. ఈ 2కే రన్ ప్రదర్శనను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న ఎల్ నినో (El Nino) ప్రభావాన్ని తట్టుకోవాలంటే ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ప్రకృతిని కాపాడినప్పుడే సమాజంలో మానవ మనుగడ సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛత కోసం 'స్వర్ణాంధ్ర' స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛతకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV