
న్యూఢిల్లీ, 28 జూలై (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఆయన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక గ్రామీణాభివృద్ధి అంశాలు, ఉపాధి హామీ పథకంలో కొత్త పనుల చేరిక, నివాస గృహాల నిర్మాణాలకు సంబంధించిన వివరాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు.
ఈ భేటీలో ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద తెలంగాణ రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, కాబట్టి ఈసారి రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వివరించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వీబీ-జీ రామ్-జీ (VB-G RAM-G) జాబితాలో చేర్చి, లబ్ధిదారులకు 90 రోజుల పాటు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ఎల్నినో ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీబీ-జీ రామ్-జీ పథకంలో అదనపు పనులను చేర్చాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణం వంటి 10 రకాల కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. వీటితో పాటు రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ భూముల పునరుద్ధరణ పనులకు కూడా ఉపాధి హామీ కింద అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రేవంత్ రెడ్డి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు