
అమరావతి, 28 జూలై (హి.స.)
, గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ అజయ్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్లో స్పందిస్తూ.. గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించారని, తన తండ్రి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ క్రీడా వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారని కొనియాడారు. అజయ్ సాధించిన ఈ విజయం ఏపీతో పాటు యావత్ భారతదేశానికే గర్వకారణమన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ క్రీడా కీర్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
తండ్రికి తగ్గ తనయుడు: మంత్రి లోకేశ్
కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబును మంత్రి నారా లోకేశ్ అభినందిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘గ్లాస్గో 2026లో పురుషుల 79 కేజీల వెయిట్లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు హృదయపూర్వక అభినందనలు. తన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ, అజయ్ యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అతను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాము’ అంటూ ఎక్స్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ