
హైదరాబాద్, 28 జూలై (హి.స.)రైతు చెంతకు నూతన సాంకేతికతే ‘రైతునేస్తం’ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు(మంగళవారం) రైతునేస్తం 100వ ఎపిసోడ్ను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రైతు - శాస్త్రవేత్త - అధికారుల అనుసంధానానికి దేశంలోనే తొలి డిజిటల్ వేదిక రైతునేస్తమని అన్నారు. 2024 మార్చి 6న ప్రారంభమైన రైతునేస్తం.. నేడు 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ఇప్పటివరకు 27.30 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరినట్లు వెల్లడించారు.
ప్రతి మంగళవారం రైతుల ప్రశ్నలకు ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధిక నీరు అవసరమయ్యే వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయిల్ పామ్, ఉద్యాన, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి సారించాలన్నారు. జులైలో 27 శాతం వర్షపాతం లోటు నమోదైందని వెల్లడించారు. ఆగస్టు 10 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాల సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్