
నెహ్రూనగర్ (గుంటూరు),, 28 జూలై (హి.స.)
: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళ రూ.లక్షల్లో దోచుకుందని బాధితులు వెంకట శిరీష, గంగమ్మ, వెంకటచంద్ పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం బాధితులు విలేకరులతో మాట్లాడారు. పట్టాభిపురం, కొరిటెపాడుకు చెందిన వెంకట శిరీష, వెంకటచంద్, శారదాకాలనీకి చెందిన గంగమ్మ కుమార్తె లక్ష్మి డిగ్రీలు పూర్తి చేశారు. గోరంట్లకు చెందిన మహిళ వీరికి వేర్వేరు సందర్భాల్లో పరిచయమై తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలుసునని నమ్మించింది. తన బృందంలోని కొంతమంది ఉన్నతస్థాయుల్లో పని చేస్తున్నారని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ.. చనిపోయినవారి కుటుంబ సభ్యుల కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపించింది. అందుకు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు డబ్బు ఇవ్వాలని చెప్పింది. గంగమ్మ కుమార్తెకు ప్రభుత్వ ఉపాధ్యాయిని పోస్టు ఇప్పిస్తానంటూ రూ.14 లక్షలు, వీఆర్వో ఉద్యోగం పేరుతో వెంకటశిరీష నుంచి రూ.11 లక్షలు, వెంకటచంద్ నుంచి 12 లక్షలు వసూలు చేసింది. అనంతరం సదరు మహిళ నకిలీ నియామకపత్రాలిచ్చింది. విజయవాడలోని అంబాపురం తీసుకెళ్లి రెండు నెలలు శిక్షణ ఇప్పించింది. తరువాత పోస్టింగ్ల పేరుతో నెలల తరబడి కాలయాపన చేయడంతో బాధితులకు అనుమానం వచ్చి విచారించగా.. మోసపోయినట్టు తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. నిందితురాలిపై ఇప్పటికే అరండల్పేట, పట్టాభిపురం, నల్లపాడు పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులున్నాయని చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ