
హైదరాబాద్, 28 జూలై (హి.స.)హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా.. సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సఖ్యత లేని కారణంగా హైదరాబాద్లో మెట్రో రైలు కొత్త నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఫలితంగా నగరవాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చితే 8 ఏళ్లలో నూతనంగా ఒక్క కిలోమీటరు పని కూడా చేపట్టలేదు.
దీంతో ఇండియాలో మెట్రో అభివృద్ధిలో నగరం 9వ స్థానానికి పరిమితమైంది. ఆపరేషన్స్లో మాత్రం 5వ స్థానంలో కొనసాగుతోంది. నగరంలో 2012లో మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పనులను 2017 నవంబర్లో పూర్తిచేసి పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రోజుకు 1100 మెట్రో సర్వీసులు నడుస్తుండగా.. సగటున 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
రెండో దశ పూర్తయితే..
హైదరాబాద్లో రెండో దశ మెట్రో విస్తరణ కోసం సుమారు 8 ఏళ్లుగా నగరవాసులు ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వరకు ఊరిస్తున్నారే తప్ప అందుబాటులోకి తీసుకురావడం లేదని నగరవాసులు వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం కోటికి పైగా మంది నివసిస్తున్నారని, కాలుష్యం, ట్రాఫిక్ నివారణకు, వేగవంతమైన ప్రయాణానికి మెట్రో రైలు ఒక్కటే మేలైన మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, మొదటి దశలో ఇప్పటికే 69 కిలోమీటర్ల మేరకు రైళ్లు నడుస్తున్నాయి. రెండో దశలోని 7 కారిడార్లలో ప్రతిపాదించిన 122.9 కిలోమీటర్ల పనులు పూర్తయితే మొత్తం నగరంలో 191.9 కిలోమీటర్ల నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. అలాగే 143 స్టేషన్ల గుండా ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు తిరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్