మిగిలింది వారమే.. ‘సర్’
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
SIR forms


హైదరాబాద్, 28 జూలై (హి.స.)ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మిగిలిపోయిన వారి అడ్రస్లను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు, సిబ్బందితో సహా అందరూ ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణపై దృష్టి కేంద్రీకరించారు. గతంతో పోలిస్తే కొంత పరిస్థితి మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వాల్సిన వారు అధికంగానే ఉండటం గమనర్హం.

వాటి అందజేతకు కొందరు నిరాకరిస్తుండగా.. మరికొందరు అందుబాటులో లేకపోవడంతో డిజిటలైజేషన్ ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. ఇంటి అడ్రసులు మారిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి సమాచారం అందించి ఎన్యుమరేషన్ పత్రం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 5,13,144 మంది ఓటర్లు ఉన్నారు. సర్లో భాగంగా వీరందరికి ఎన్యుమరేషన్ పత్రాలను జూన్ 25 వ తేదీన ప్రారంభించారు.

ఇప్పటివరకు 3,77,223 మంది ఓటర్లు డిజిటలైజేషన్ పూర్తి చేశారు. వారిలో వాస్తవంగా 2,88,740 మాత్రమే కాగా.. 56.3 శాతం నమోదయింది. అందుబాటులో లేనివారు, మృతులు, అడ్ర్సలు మారిన వారితో కలిపి 88,483 మంది ఉన్నట్లు తేల్చారు.

నియోజకవర్గం పరిధిలో ఇంకా స్పందించాల్సిన ఓటర్లు 1,35,921 మంది ఉన్నారు. సర్ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీన ముగుస్తుంది. కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో లక్షకు పైగా ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకొని డిజిటలైజేషన్ చేయడం కష్టసాధ్యమనే చెప్పాలి. అందిన ఎన్యుమరేషన్ పత్రాలను యాప్లో అప్లోడ్ చేసేందుకు ప్రత్యేక కేంద్రాల్లో ముమ్మరంగా కసరత్తు కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీకి చెందిన వారు ఎన్యుమరేషన్ పత్రాలను తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ స్వస్థలాల్లో ఓటు హక్కు ఉండేలా అక్కడే పత్రాలను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటువంటి వారి నుంచి ఆయా ప్రాంతాల్లో ఓటరు నంబర్ తీసుకొని ఆ సమాచారాన్ని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande