29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల
29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల
nadendla


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ‘మీ మార్ట్’ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.

ఏపీ వ్యాప్తంగా స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో రూ.40కు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు అందించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ధాన్యం ట్రాకింగ్‌కు ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీని అమలు చేస్తున్నామని అన్నారు. డిజిటల్ వాలెట్ విధానం ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్పారు.

ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరల స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మిల్లర్లతో చర్చలు జరిపామని, ప్రస్తుతం కిలో రైస్ ధర రూ.52 వద్ద ఉండేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ వెరైటీ రైస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande