
పార్వతీపురం, 28 జూలై (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా మధ్య తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా ఎటువంటి ముప్పు లేదు. ఈ వాయుగుండం తన దిశను మార్చుకుని ఉత్తరం వైపు పయనించడంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం తప్పింది.
అయినప్పటికీ, దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, పోలవరం, ఉభయ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా చినుకులు పడవచ్చు.
ఇక సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. ఈదురుగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు చెట్లు లేదా విద్భుత్ స్తంభాల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi