
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)
అమరావతి వేదికగా ఏపీ ప్రభుత్వం - యునైటెడ్ కింగ్డమ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు(మంగళవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పురపాలక శాఖ - యూకే డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, సైన్స్ & ట్రేడ్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఆపై పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. అలాగే, యూకే ప్రతినిధి బృందంతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ భాగస్వామ్యాలపై రెండు పక్షాల అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్తో అసోసియేట్ అవుతూ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, సస్టైనబుల్ సిటీస్ అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. డిప్యూటీ హై కమిషనర్తో పాటు యూకే ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. 123 మున్సిపల్, కార్పొరేషన్లకు రూ.40 వేల కోట్ల టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామన్నారు. వాటిలో యూకే టెక్నాలజీని ఉపయోగించేందుకు యూకే ప్రభుత్వంతో మాట్లాడి ఎంఓయూ చేసుకున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ