
అమరావతి, 26 ఆగస్టు (హి.స.)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం జిల్లాలో శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. శబరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 28 అడుగులకు చేరుకుంది. శబరి నది ఉగ్రరూపంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు ముకునూరు ప్రాంతంలో సోకిలేరు వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి కల్వర్టు పూర్తిగా నీట మునగడంతో చింతూరు, వి.ఆర్.పురం మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రహదారి మార్గాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ఉద్యోగులు ప్రమాదాన్ని లెక్కచేయకుండా నీటితో మునిగిపోయిన కాజ్వేపై నడుచుకుంటూ విధులకు హాజరవుతున్నారు. వరద నీటిలో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
శబరి నది వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంకలు, నీటితో మునిగిన రహదారులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ