
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)
సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఆయన అగ్నిమాపకశాఖ, సీఐడీ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్ ఇవ్వలేదు. దీంతో ఆయనపై సాధారణ విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణాధికారిగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ను సీఎస్ సాయిప్రసాద్ నియమించారు. నిర్ణీత గడువులోపు విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గతేడాది జనవరిలో సంజయ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన పరిధిలో లేకపోయినా రూ.1.20కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో 8 అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇవ్వాలని ప్రభుత్వం సంజయ్ను ఆదేశించింది. ఆయన స్పందించకపోవడంతో విచారణ నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ