'మూసీ పునరుజ్జీవనం' ప్రాజెక్టుపై CM రేవంత్ సమీక్ష.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
'మూసీ పునరుజ్జీవనం' ప్రాజెక్టుపై CM రేవంత్ సమీక్ష.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
Cm


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

లండన్ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఆయన ఎంసీఆర్హెచ్ఐర్డి బోధి పెవిలియన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ ' నది పునర్జీవం(Musi Rejuvenation) పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మూసీ సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ విషయంలో బాధితులు, భూములు ఇచ్చే వారికి సరైన పరిహారం, లబ్ధి చేకూరేలా 'ల్యాండ్ పూలింగ్' విధానంపై స్పష్టమైన విధివిధానాలు (Policy) రూపొందించాలని సూచించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయానికి వెంటనే టెండర్లు పిలవాలని, కొత్వాల్గూడ బర్డ్ పార్కు పబ్లిసిటీ చేయాలన్నారు. ఇక ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై మున్సిపల్ కమిషనర్లు ఫోకస్ పెట్టాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL), బఫర్ జోన్లోని భూములపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రెండో విడత (ఫేజ్-2) పనులకు సంబంధించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR) జారీ వినియోగంపై అధికారులు ప్రతి వారం క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించాలని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) అధికారులు, సీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande