
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
మల్కాజిరి పోలీస్ కమిషనర్ సుమతి
సారధ్యంలో సరికొత్తగా చేస్తున్న డ్రోన్ పెట్రోలింగ్తో పోకిరీలు, ఆకతాయిలు, నేరస్థులలో కలవరాన్ని రేపుతోంది. ప్రజలకు, శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్మానుష్య ప్రదేశాలు, గల్లీలు, క్రైమ్ హాట్ స్పాట్స్లలో రాత్రి సమయాలు, ఇతర వేళలను అడ్డాగా చేసుకుంటున్న వారిని పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్తో భరతం పడుతున్నారు. ముఖ్యంగా బహిరంగంగా మద్యం సేవించే, నిర్మానుష్య ప్రాంతాల్లో మత్తు పదార్థాలు తీసుకునే, రాత్రి సమయాల్లో గల్లీలలో తిష్ట వేసి న్యూసెన్స్ చేసే, క్రైమ్ హాట్ స్పాట్స్లో అనుమానాస్పదంగా తిరిగే అల్లరి మూకలను డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా గుర్తించడంతో పాటు వారి చేష్టలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి వారిని కట్టడి చేస్తున్నారు.
ఈ డ్రోన్ పెట్రోలింగ్ ఆధారాలతో పోకిరీలు, ఆకతాయిల చట్టవ్యతిరేక పనులను కోర్టు విచారణలో నిరూపిస్తుండడంతో పోకిరీలకు ఈ పెట్టీ కేసులలో శిక్షలు ఖాయంగా మారింది. మల్కాజిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా నమోదు చేసిన 50 కేసులలో నిందితులకు పలు రోజుల జైలు శిక్షలు, భారీ జరిమానాలు, సామాజిక సేవ శిక్షలు పడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ డ్రోన్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా నిర్వహించి పోకిరీలు, క్రిమినల్స్, సమయ నిబంధనలను పాటించకుండా వివాదాలకు కారణమవుతున్న వ్యాపారుల పై నజర్ పెంచుతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు