
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల రిజిస్టర్డ్ ఆస్తులను, పట్టా భూములను 22ఏ లో చేర్చి సామాన్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసింది ప్రభుత్వమైతే, దరఖాస్తులు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సింది ప్రజలా అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ 22ఏ దందా నడుస్తోందని, ప్రజల రక్తాన్ని పిండుతున్న తుగ్లక్ పాలన రాష్ట్రంలో సాగుతోందని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్ లోని పద్మారావు నగర్, స్ప్రింగ్ఫీల్డ్, రుక్మిణి ఎస్టేట్స్, నిజాంపేట్, బాచుపల్లి, గాజులరామారం వంటి పాత కాలనీలతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, యాదాద్రి జిల్లా చల్లూరు తదితర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నాటి పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం దుర్మార్గమని హరీశ్రావు పేర్కొన్నారు. 98 శాతం సమస్య పరిష్కారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఉన్న లేఅవుట్లను సైతం ఈ జాబితాలోకి నెట్టి, కమీషన్ల కోసం బ్రోకర్లను రంగంలోకి దించారని ఆరోపించారు. ఒక్కో ప్లాట్కు, విల్లాకు ఇంత చొప్పున వసూలు చేస్తేనే జాబితా నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో భూముల విలువ పెరిగి ప్రజలకు ఆర్థిక భరోసా దక్కితే, రేవంత్ రెడ్డి పాలనలో ఒకవైపు హైడ్రా, మరోవైపు 22ఏ పేరుతో ప్రజల ఆస్తుల విలువను నేలమట్టం చేశారని విమర్శించారు. పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, చదువుల కోసం దాచుకున్న చిన్న చిన్న స్థలాలను అమ్ముకోలేని దుస్థితి కల్పించారన్నారు. ఒకవైపు ప్రభుత్వ, అసైన్డ్ భూములను పెద్దలకు కట్టబెడుతూ, మరోవైపు సామాన్యుల ఆస్తులపై కబ్జాదారుల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పి, 'భూభారతి' పేరుతో భూమేతగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేశారని ఎద్దేవా చేశారు.
ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, 22ఏ జాబితా వివరాలను బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్లెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజా సమస్య పరిష్కారం కాకపోతే సభను స్తంభింపజేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధితులు ఎవరూ దళారులను నమ్మి కమీషన్లు ఇవ్వవద్దని, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..