
రాజన్న సిరిసిల్ల, 25 ఆగస్టు (హి.స.)
పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో మంగళవారం రోజున వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..