
నిజామాబాద్, 25 ఆగస్టు (హి.స.)
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నిజామాబాద్ లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ..మాదకద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నశాముక్త భారత్ అభియాన్ విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని గవర్నర్ అన్నారు. మాదకద్రవ్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు యువతలో అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కూడా ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ కార్యక్రమంతో పాటు పోలీసుశాఖ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరీ క్లబ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేయడం మంచి ప్రయత్నమన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో మాదక, హానికర పదార్థాల లభ్యతను నియంత్రించడంతో పాటు చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలోని శక్తి, ప్రతిభ, కలలే దేశానికి అతిపెద్ద సంపద అని గవర్నర్ అన్నారు. వాటిని మాదకద్రవ్యాలకు బలి చేయొద్దని విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షణిక ఆకర్షణలకు లోనై యువత తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, విచక్షణ, ఆత్మ నియంత్రణను జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలని సూచించారు.
పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ నమ్మకం, ఆప్యాయతతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. యువత, కుటుంబాలు, విద్యాసంస్థలు, స్థానిక సమాజం సమన్వయంతో పని చేస్తే మాదకద్రవ్యాల వంటి సామాజిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. నశా ముక్త సమాజ నిర్మాణంలో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీసులు చేపడుతున్న విస్తృత అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు