వరుసగా దొంగల బీభత్సం.. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు
వరుసగా దొంగల బీభత్సం.. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ


కర్నూలు, 25 ఆగస్టు (హి.స.) కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, బాధితులు లేని సమయంలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస నగర్లో హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 23 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. చోరీ అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.

అదే ప్రాంతంలో విశ్రాంత ఆర్ఎస్సె సుబ్బయ్య ఇంట్లోనూ చోరీ జరిగింది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.30 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఒకే ప్రాంతంలో రెండు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

చోరీలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు చోరీలకు ఒకే ముఠా పాల్పడి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస నగర్లో వరుస చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande