
కర్నూలు, 25 ఆగస్టు (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తీరప్రాంతం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఆస్కారముందని అధికారులు పేర్కొన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటూ ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో పాటు కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బలహీనమైన నిర్మాణాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తడవకుండా భద్రపరుచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోత ప్రభావంతో వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల రాష్ట్రంలో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. తాజా అలర్ట్ ప్రకారం పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం వేళ ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు చెదురుమదురుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఎండ వేడిమి వల్ల ఏర్పడిన ఉష్ణప్రసరణ ప్రక్రియ వర్ష మేఘాల ఏర్పాటుకు దోహదం చేయడంతో ఈ వర్షాలు కురువనున్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV