తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
శ్రావణమాసం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్న తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.
తిరుమల


తిరుమల, 26 ఆగస్టు (హి.స.)శ్రావణమాసం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్న తిరుమలకు భక్తుల రద్దీ (Crowd of devotees) పెరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి, వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరి వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు.

మరోవైపు, నిన్న ఒక్కరోజే మొత్తం 73,285 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో 32,334 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వ్యవహరించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande