
ఖమ్మం, 27 ఆగస్టు (హి.స.)
తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విద్యా వసతులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం. గోపాలపురం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల భవనం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాం అని తెలిపారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు