
శ్రీశైలం, 27 ఆగస్టు (హి.స.)నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు.
దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలు, స్థానాల్లోకి మార్చడంతో పరిపాలనా వ్యవస్థలో కొత్త సమీకరణాలు చోటుచేసుకోనున్నాయి.
బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే సంబంధిత ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల నుంచి రిలీవ్ అయి, ఉత్తర్వుల్లో కేటాయించిన నూతన స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఈఓ స్పష్టం చేశారు. ఉద్యోగుల విధుల మార్పు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని అధికార యంత్రాంగం ఆదేశించింది.
ఇటీవల శ్రీశైలం దేవస్థానంలో పలు అంశాలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో తాజా బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించినట్లు ఉద్యోగుల వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. మొత్తంగా 37 మంది ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలతో శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ మార్పుల అనంతరం దేవస్థానం రోజువారీ పరిపాలన, ఉద్యోగుల విధుల నిర్వహణలో మరింత సమన్వయం ఏర్పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది..!
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV