
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి నేపాల్‌లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడుగురు యాత్రికులలో నలుగురు సురక్షితంగా ఉండగా, మరో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడి తాజా వివరాలు తెలుసుకున్నారు.
గల్లంతైన వారిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ బృందంలోని శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు సమాచారం. గల్లంతైన ముగ్గురి ఆచూకీని త్వరగా కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు.
మరోవైపు, కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. సురక్షితంగా ఉన్నవారిని వీలైనంత త్వరగా రాష్ట్రానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. యాత్రికుల భద్రత, తరలింపు విషయమై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలతో పాటు ఈషా ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు.
మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు, ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. యాత్రికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi