లక్కీడ్రా ప్రత్యక్ష ప్రసారం
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో భాగంగా క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈనెల 28 నుంచి 31వ తేది వరకు నిర్వహించనున్నారు.
Indiramma houses


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో భాగంగా క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈనెల 28 నుంచి 31వ తేది వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగురోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. లాటరీ ప్రక్రియను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా పారదర్శకంగా డ్రా తీసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థలాభావం భద్రతా ఏర్పాట్లు, ఇతర కారణాల వలన లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తు దారులందరినీ అనుమతించలేమని, అయితే ఆయా కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ వీక్షించేందుకు స్ర్కీన్లను ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు.

లాటరీ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్సైట్లోనూ హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ tghb.officialతో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లో చూడవచ్చన్నారు. అనర్హులుగా గుర్తించిన వారి నుంచి అభ్యంతరాలను తీసుకుని పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంలో సిఫారసులు, దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేదని హౌసింగ్ బోర్డు వైస్చైర్మన్ స్పష్టం చేశారు. మధ్యవర్తులను నమ్మొద్దన్నారు.

మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..

లాటరీలో తమపేరు రాకున్నా దరఖాస్తుదారులు దిగులు పడొద్దనీ, తదుపరి విడతలో నిర్మించే టవర్స్ అర్హులుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చేపడుతున్నవి పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని, మొత్తం లక్ష ఇళ్లను నిర్మిస్తామన్నారు. తర్వలో ప్రకటించే ఎంఐజీ హౌసింగ్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ 040 24603572కు ఫోన్ చేయవచ్చన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande