
అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
రుషికొండ తీరంలో సముద్ర స్నానాలకని దిగిన ఏడుగురు యువకులు కొట్టుకుపోతుండగా జీవీఎంసీ, టూరిజం బ్లూఫ్లాగ్ బీచ్ లైఫ్గార్డులు వారిని రక్షించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ (రాయపుర్)కు చెందిన రాజేంద్రసత్య, మనోజ్తండిల్వాల్, కిశోర్కుమార్ఠాకుర్, తరుణ్వర్మ, ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన టి.మురళీ, జి.శ్రీరామ్కుమార్, ఆర్.తేజశ్వర్రావు విహారయాత్రలో భాగంగా రుషికొండ తీరానికి విచ్చేశారు. స్నానాలు చేయడానికి సముద్రంలోకి దిగారు. అలల ఉద్ధృతి అధికంగా ఉండటంతో సముద్రంలో కొట్టుకుపోతున్న వీరిని లైఫ్గార్డులు గుర్తించి మెరైన్ పోలీసుల సహకారంతో ఒడ్డుకు చేర్చారు. మెరైన్ సీఐ అప్పారావు, ఎస్సై మనోజ్కుమార్ సూచనల మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
రెల్లివీధికి చెందిన చిన్ని ఈశ్వరరావు(56) ఉదయం ఈత నిషేధిత ప్రాంతంలో స్నానం చేస్తూ అలల తాకిడికి కొట్టుకుపోతుండగా గత ఈతగాళ్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. సీఐ ఎల్.అప్పలనాయుడు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. బీ సందర్శకులు సముద్ర స్నానాలు చేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ (ఆర్ఎల్ఎస్ఎస్), వాటర్స్పోర్ట్స్ అధ్యక్షుడు బి.బలరామ్నాయుడు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న లైఫ్గార్డుల సేవలను కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ