చిన్ననాటి నుంచే ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ప్రియాంక
చిన్ననాటి నుంచే ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ప్రియాంక
కలెక్టర్


నారాయణపేట, 31 ఆగస్టు (హి.స.)

విద్యార్థులకు చిన్ననాటి నుంచే డబ్బు వినియోగం, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాల పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల గురుకుల బాలికల పాఠశాలలో స్వతహ ఫౌండేషన్ సౌజన్యంతో జిల్లాలోని ఎంఈఓలు, హెచ్ఎంలకు ఫైనాన్షియల్ లిటరసీ, 'మనీ మంత్ర' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 88 ప్రాథమికోన్నత పాఠశాలలు ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి ఎంపిక కావడం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా గొప్ప అవకాశమన్నారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బును సక్రమంగా పొదుపు చేయడం, సరైన విధంగా పెట్టుబడి పెట్టడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం అంతకంటే ముఖ్యమని తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియా, టెక్నాలజీ ద్వారా త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆకర్షణీయమైన ప్రకటనలు, తప్పుడు పెట్టుబడి పద్ధతులు విద్యార్థులు, యువతను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అత్యాశకు లోనై ఆర్థికంగా నష్టపోయి సమస్యలను ఎదుర్కొంటున్న ఘటనలను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు విద్యార్థులకు ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయిలోనే ఆర్థిక అక్షరాస్యతను సాధారణ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande