
రాజన్న సిరిసిల్ల, 31 ఆగస్టు (హి.స.)
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 26 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. తద్వారా ఫిర్యాదుదారులకు పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తూ, వాటిలో ఎంత మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు