
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) 1,000 రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిచ్చాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు-మహిళలు-యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలో.. కొత్త అధ్యాయాన్ని నమోదు చేశాం’’ అని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో.. ప్రజా ప్రభుత్వం సెప్టెంబరు 1కి 1,000 రోజుల మైలురాయిని చేరుకుంటున్న నేపథ్యంలో.. ‘ప్రగతి నివేదిక’ను విడుదల చేసింది.
‘2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు సమగ్ర అభివృద్ధి దిశగా కార్యాచరణను అమలుచేస్తున్నాం’ అని నివేదికలో స్పష్టంచేసింది. అంశాలవారీగా ప్రగతిని ప్రస్తావించింది.
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఊరటనిచ్చాం. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించాం. రైతు సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్ల వ్యయం చేశాం. వరి సాగు, ఉత్పత్తిలో దేశంలో నంబర్-1గా నిలిచింది తెలంగాణ. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాం.
యువతకు ఉద్యోగాలు-నైపుణ్యాలకు కొత్త వేదిక
72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. యువతలో నైపుణË్యం పెంపొందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించాం. 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. గోషామహల్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం. 2023 డిసెంబరు 7 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం అందించాం. సీఎంఆర్ఎఫ్ వైద్య రీయింబర్స్మెంట్ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్లు.. 39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్ఓసీలు ఇచ్చి ఆదుకున్నాం.
కల్తీపై ఉక్కుపాదం
ఆహార కల్తీ, డ్రగ్స్ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ సంస్థ ఏర్పాటుచేశాం. డ్రగ్స్పై ఈగల్ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం చేస్తున్నాం. భూ భారతి చట్టం, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు అమలుచేస్తున్నాం. 3.76 లక్షల కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలు జారీచేశాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల ప్రణాళిక, హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ, మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి, మూసీ పునరుజ్జీవంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి, 39 కొత్త ఎస్టీపీలు వంటి ప్రగతి ప్రణాళికలు రూపొందించాం. టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాం. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు. హైదరాబాద్లో 355కిపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుతో..డేటా సెంటర్లు, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్