
మెదక్, 31 ఆగస్టు (హి.స.) మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు